Murali Krishna, News18, Kurnool
అరుంధతి సినిమా (Arundhathi Movie)… తెలుగు సినీ అభిమానులందరూ మెచ్చిన చిత్రం.. అందులో జేజమ్మగా అనుష్క (Anushka Shetty) నటన అద్భుతం..ఎప్పుడో వచ్చిన అరుంధతి సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? ఆ సినిమాలో ఉన్న వైభవోపేతంగా కనువిందు చేసిన కోట గుర్తుందా.. ఆ ఇంద్రభవనంలాంటి ఇంటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే వారేవా అనాల్సిందే..! ఇంతకీ ఆ కోట ఎక్కడుందో తెలుసా..! భారతదేశంలోని అతి పురాతనమైన కట్టడాలలో ఒకటి కర్నూలు జిల్లా (Kurnool District) బనగానపల్లె నవాబు బంగ్లా. అరుంధతి సినిమా రిలీజ్ తర్వాత దాదాపు అందరికీ ఈ బంగ్లా గురించి తెలిసిపోయింది. ఎంతోమంది అది ఎక్కడుందో వెతికి మరి వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు దిగొచ్చారు కూడా. అయితే ఈ బంగ్లా వెనక ఉన్న రహస్యాలేంటో మీకు తెలుసా..!
రాజా నంద చక్రవర్తి నుండి 1601లో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ బనగానపల్లి కోటను జయించాడు. కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్ మెచ్చిన జనరల్ సిద్ధు సుంబాల్ నియంత్రణలో ఉండేవి. అతను వాటిని 1665 వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ముహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్‌బహానీకి మర్యాదపూర్వకంగా ఈ బనగానపల్లి, చుట్టుపక్కల ప్రాంతాలను ఇచ్చారు.
ఇది చదవండి: రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ప్రాణం పోసిన శిల్పి..! రాజసం ఉట్టిపడేలా విగ్రహ తయారీ..!
అయితే ఆ రాజుకు వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడు ఫైజ్ అలీఖాన్ బహదూర్ వీటి పరిరక్షణ చూసుకునేవాడు. అప్పటి రాజులు బనగానపల్లెలోని తమ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కోసం ఊరికి దూరంగా ఎత్తైన కొండపై ఈ బంగ్లాను నిర్మించారు. 1947 వరకు బనగానపల్లి నవాబుల పాలనలో స్వతంత్ర రాష్ట్రంగా ఉంది.
ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?
కోటను చూస్తూ మైమరచిపోవాల్సిందే..!
ఈ కోట ఆనాటి రాజ వైభవానికి మరియు భారతీయ వాస్తుశిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ కోట నిర్మాణం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే. అంత గొప్పగా ఈ కోటను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ కోట ఎంట్రన్స్ ..రెండు వైపులా మెట్లు ఎక్కి కోటలోకి వెళ్లేందుకు చేపట్టిన నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ కోటలోపల తొమ్మిది గదులు, ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ కోట నిర్మాణం అబ్బురపరుస్తుంది.
ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!
అనుష్క నటించిన అరుంధతి సినిమాతో ఈ కోటకు పూర్వం వైభవం వచ్చిందనే చెప్పుకోవాలి. వేసవి సెలవుల్లో, వీకెండ్స్, హాలిడేస్‌లో ఫ్యామిలీలతో కలిసి ఇక్కడకు వచ్చి కోట అందాలను తిలకిస్తుంటారు. కేవలం ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిన వారే కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ కోటను చూడ్డానికి సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ శాతం యువత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా వస్తుంటారు. ఈ కోటకు సంబంధించిన నవాబ్ గారి కుటుంబీకులు ఇప్పటికీ ఉండడంతో అది ప్రైవేటు వారి ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ కోటను సందర్శించాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు రూ.30, పిల్లకు రూ.20 టికెట్ తీసుకోవాలి.
అడ్రస్: నవాబ్ బంగ్లా (అరుంధతి కోట), బనగానపల్లె, కర్నూలు, ఆంధ్రప్రదేశ్- 518124
ఎలా వెళ్లాలి: కర్నూలు నుంచి బనగానపల్లెకు దాదాపు 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కర్నూలు నుంచి బెతంచెర్ల మీదగా బనగానపల్లె చేరుకుంటే చాలు.. అక్కడ నుండి 8 కిలోమీటర్లు యాగంటికి వెళ్లే దారిలో కుడివైపున ఈ బంగ్లా కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News